
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసులో టీం ఇండియా మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్లకు చెందిన ఆస్తులను ఈడీ సీజ్ చేసిన విషయం తెలిసిందే. వారికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ఈ కేసులో ఇంకా ఈడీ విచారణ జరుగుతూనే ఉంది. కాగా, ఈ వ్యవహారంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.
వీళ్లేం సెలబ్రిటీలు? అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? అని సజ్జనార్ ప్రశ్నించారు. బెట్టింగ్ మహామ్మారికి వ్యసనపరులై ఎంతో మంది యువకులు తమ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. వేలాది మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన చెందారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన వీరు వీటన్నింటికీ బాధ్యులు కారా? అని నిలదీశారు. సమాజ మేలు కోసం, యువత ఉన్నతస్థానాలకు చేరుకోవడానికి నాలుగు మంచి మాటలు చెప్పండి.. అంతేకానీ మిమ్ముల్ని అభిమానించే వాళ్లను తప్పుదోవపట్టించి వారి ప్రాణాలను తీయకండి.. అని సెలబ్రిటీలకు సజ్జనార్ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..