
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)
సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారు.. కాంగ్రెస్ లేకుంటే ముస్లింలకు ఇజ్జత్ ఉండదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని సీఎం వ్యాఖ్యలు గుర్తుకు చేశారు. ముస్లింలు అజాదీ కోసం యుద్ధం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అని హరీశ్రావు ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, జూబ్లీ హిల్స్లో ఉండే 4 లక్షల ప్రజల భవిష్యత్తు కాదని, నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తు పై ఆధారపడి ఉంటుందని అన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర దశ, దిశా మారబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బ్రదర్స్ మాత్రమే సంతోషంగా ఉన్నారని, తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఏం చేశారో జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకం వల్లనే PJR చనిపోయారని అన్నారు. దేశంలో అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, మంత్రులే రేవంత్ రెడ్డి మాట వినరని విమర్శించారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటై పని చేస్తున్నారని ఆరోపించారు. ఓట్ చోరీ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్లో కచ్చితంగా బీఆర్ఎస్ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..