
హనుమకొండ, 7 నవంబర్ (హి.స.)
మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన దాసరి సురేందర్ అలియాస్ సూరీని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండలోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎనిమిది మంది ముఠా సభ్యులను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శుక్రవారం మీడియా ఎదుట హాజరుపరిచారు. కరడుగట్టిన నేరస్తుడు సూరీ హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణకు గురైన తరువాత వరంగల్ నగరంలోని భీమారంలో మకాం వేశాడు. ఏడుగురితో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు.
అక్టోబర్ 18న రాత్రి సమయంలో వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శాయంపేట మండలం మందారిపేట హైవే రోడ్డులో లారీ డ్రైవర్ను బెదిరించి రెండు బైకులలో పెట్రోల్ పొయించుకున్నాడు. లారీ డ్రైవర్ పిర్యాదు మేరకు శాయంపేట, వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠా నుంచి రెండు పిస్టల్స్, కత్తి, రెండు బైకులు, ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది మంది ముఠాలో నలుగురు విద్యార్థులు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు