
అమరావతి, 7 నవంబర్ (హి.స.)భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త సివి రామన్ (CV Raman) కు రాష్ట్ర మంత్రి నారాయణ (Minister Narayana) నివాళులు అర్పించారు. ట్విట్టర్ వేదికగా సివి రామన్ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. రామన్స్ ఎఫెక్ట్ (Raman Effect) ని ఆవిష్కరించి, భౌతిక శాస్త్ర పరిశోధనల్ని మలుపు తిప్పి, భారత ఖ్యాతిని ఖండాంతరాలకు తెలియజేసిన మేథావి సి.వి.రామన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నాను అన్నారు. విద్యార్థులందరూ సి.వి.రామన్ ను ఆదర్శంగా తీసుకుని తాము ఎంచుకున్న రంగాల్లో పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకున్నారు.
రామన్ గురించి.. సివి రామన్ భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఆయన రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్నారు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్. తమిళనాడులోని తిరుచిరాపల్లి (Tiruchirapalli) సమీపంలోని అయ్యన్ పెటాయ్ గ్రామంలో జన్మించారు. చంద్రశేఖర్ అయ్యర్, పార్వతీ అమ్మాళ్ తల్లిదండ్రులు. రామన్ తండ్రి వారి కుటుంబం 1882 తరువాత విశాఖపట్నంలో (Vishakapatnam) నివాసం ఉంది. చిన్నతనం నుంచే జ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండేవారు. మెట్రిక్యూలేషన్ లో ఫిజిక్స్ గోల్డ్ మెడల్ సాధించారు. ఎంఎస్సీ ఫిజిక్స్ లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు. 18 ఏళ్ల వయసులోనే కాంతి అనుబంధ సూత్రాలపై పరిశోధన వ్యాసాన్ని లండన్ వేదికగా వెలువడే ఫిలసాఫికల్ మేగజైనులో ప్రచురితమయ్యేలా ప్రతిభను చూపారు. రామన్ ఎఫెక్టును కనుగొన్నందుకు గానూ 1930 సంవత్సరం డిసెంబరులో నోబెల్ బహుమతిని అందుకున్నారు. 1954లో భారత ప్రభుత్వం రామన్ ను భారత రత్న (Bharat Ratna) పురస్కారంతో సత్కరించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువీకరించిన రోజైన ఫిబ్రవరి 28ని జాతీయ సైన్స్ దినోత్సవంగా (National Science Day) ప్రభుత్వం ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV