
సామర్లకోట, 8 నవంబర్ (హి.స.)
ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకుండా వాట్సాప్ ద్వారా సూచనలిచ్చి రోగికి వైద్యం చేయడంతో పరిస్థితి విషమించి వ్యక్తి మృతి చెందిన ఘటనపై మృతుడి బంధువులు ఆందోళన చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. సామర్లకోటకు చెందిన మలిరెడ్డి భూచక్రం(60)కు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు శుక్రవారం స్థానిక సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడున్న హౌస్‌సర్జన్‌లు రోగి పరిస్థితిని వాట్సాప్ ద్వారా డ్యూటీ డాక్టర్‌కు వివరించి.. ఆమె సలహాతో చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించి భూచక్రం మృతిచెందాడు. సుమారు 50 నిమిషాలు ఆసుపత్రిలో వైద్యులకోసం ఎదురుచూసినా రాలేదని, మృతిచెందాక వైద్యురాలు వచ్చారని బాధితులు ఆరోపించారు. ఇక్కడ విధుల్లో ఉండాల్సిన వైద్యులు వారి సొంత ఆసుపత్రుల్లో ఓపీ చూసుకుంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని ఫోన్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. దీని గురించి డ్యూటీ డాక్టర్ వరలక్ష్మిని అడగ్గా లేబర్ వార్డులో గర్భిణికి చికిత్స చేస్తుండడంతో తాను అక్కడికి రాలేకపోయనని, భూచక్రం కడుపునొప్పి అని రాగా హౌస్‌సర్జన్‌లు వైద్యసేవలు అందించారని, అంతలో పరిస్థితి విషమించి అతను మృతిచెందాడన్నారు. అందుబాటులో లేననే వారి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ