
తిరుపతి, 8 నవంబర్ (హి.స.)తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (ఎస్వీయూ) ప్రాంగణంలో చిరుతపులి సంచరించడం తీవ్ర కలకలం రేపింది. విశ్వవిద్యాలయ పరిధిలోని పలు ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు కావడంతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ అధికారులు అప్రమత్తమై విద్యార్థులకు ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే, ఎస్వీయూలోని పాపులేషన్ స్టడీస్ విభాగం, ఐ-బ్లాక్ సమీపంలో చిరుత సంచరించినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా, ప్రాంగణంలోని ఓ భవన నిర్మాణ ప్రదేశంలో కుక్కపై చిరుత దాడి చేసిన సంఘటనను సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి ఆందోళన చెందారు. ఈ పరిణామంతో విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొంది.
చిరుత సంచరిస్తున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. విద్యార్థులు ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గుంపులుగా ప్రయాణించాలని, అనవసరంగా హాస్టళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఈ విషయంపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయ సిబ్బంది, విద్యార్థులు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV