
న్యూఢిల్లీ, 1 డిసెంబర్ (హి.స.)
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు (డిసెంబర్ 1న) ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కొద్దిసేపటికే అధికార -విపక్షాల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. బీహార్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ.. విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. విపక్షాలు బీహార్ ఓటమితో నిరాశలో ఉన్నాయి.. బీహార్ వైఫల్యానికి పార్లమెంట్ వేదికగా మార్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. విపక్ష పార్టీల నేతల డ్రామాలను దేశ ప్రజలు నమ్మడం లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక, ప్రధాని మోడీ వ్యాఖ్యలపై వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావించడం డ్రామానా? పార్లమెంట్ ప్రజల కోసం ఉన్నది.. కీలకమైన అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి అని డిమాండ్ చేసింది. పార్లమెంట్ లో చర్చలు జరగకుండా డ్రామాలు ఆడేది కేంద్ర సర్కార్ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అయితే స్పీకర్ ఓం బిర్లా
ఎంపీలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు ఎంపీలను నినాదాలు, ఆందోళనలు చేయడానికి పార్లమెంట్ కి పంపలేదన్నారు. అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రశ్నోత్తరాల సమయంలో కొనసాగించేందుకు సహకరించాలని విపక్ష ఎంపీలను స్పీకర్ కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు