
ఢిల్లీ 14,డిసెంబర్ (హి.స.) : దేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు చుట్టేసింది. ఉదయం ఏడు గంటలు దాటినా అంధకారం తొలగిపోలేదు. వాయు నాణ్యత (AQI) 'తీవ్రమైన' విభాగంలో కొనసాగుతోంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఉదయం 6 గంటలకు AQIని 462గా నమోదు చేసింది. ఇది ఆరోగ్యకరమైనవారికి కూడా ప్రమాదకరమని, బయటికి వెళ్లడం లేదా వ్యాయామం చేయడం మానుకోవాలని వైద్యాధికారులు సూచించారు. ఢిల్లీలోని మొత్తం 40 మానిటరింగ్ స్టేషన్లు ఎరుపు రంగు సూచికను చూపించాయి. నార్త్ వెస్ట్ ఢిల్లీలోని రోహిణిలో అత్యధికంగా 499 AQI నమోదు కాగా, పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (PM2.5) ప్రధాన కాలుష్యకారిగా ఉంది. జహంగీర్‌పురి, వివేక్ విహార్లలో కూడా AQI 495 వద్ద ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది.
7
పథకాల పేర్ల మార్పులో కేంద్రం మాస్టర్
ఢిల్లీ 14,డిసెంబర్ (హి.స.) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) బిల్లు పేరును మారుస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. పథకాల పేర్లను మార్చడంలో మోదీ ప్రభుత్వం దిట్ట అంటూ ఎద్దేవా చేసింది. మహాత్మాగాంధీ అనే పేరుంటే వచ్చిన ఇబ్బందేమిటని నిలదీసింది.
శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మీడియాతో మాట్లాడారు. పథకాలు, చట్టాల పేర్లను మార్చడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దిట్ట. గతంలో నిర్మల్ భారత్ అభియాన్‌ను స్వచ్ఛ భారత్ అభియాన్‌గా, గ్రామీణ ఎల్పీజీ పంపిణీ కార్యక్రమాన్ని ఉజ్వల యోజనగా మార్చారు. ఇలా రీ ప్యాకేజింగ్, బ్రాండింగ్‌లో బీజేపీ వాళ్లు సిద్ధహస్తులు. ఇప్పటిదాకా వాళ్లు పండిట్ నెహ్రూను మాత్రమే ద్వేషించారు. ఇప్పుడు మహాత్మాగాంధీ పేరు కూడా వారికి నచ్చడం లేదు. అందుకే, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును పూజ్య బాపు ఉపాధి హామీ పథకంగా మార్చారు’ అని జైరాం రమేశ్ ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ