
ఢిల్లీ 16,డిసెంబర్ (హి.స.)
పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముసాయిదా ఓటర్ జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్‌లో ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ప్రారంభించింది. ప్రత్యేక సర్వే ముగియడంతో మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ప్రత్యేక సర్వే తర్వాత బెంగాల్‌లో 58 లక్షలకు పైగా పేర్లు తొలగించబడినట్లు తెలిపింది. ఈ 58 లక్షల మంది జాడ లేదని పేర్కొంది.
ఓటర్లు నమోదిత చిరునామాలో లేరని.. శాశ్వతంగా బదిలీ అవ్వడమో.. లేదంటే మరణించి ఉంటారని.. దీంతో 58 లక్షల మంది పేర్లు తొలగించినట్లు పేర్కొంది. ప్రస్తుతం 7.66 కోట్లకు పైగా ఓటర్లు పరిగణనలో ఉన్నట్లు తెలిపింది. 7,66,37,529 మంది ఓటర్లు సవరణ డ్రైవ్ పరిధిలోకి వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. అక్టోబర్ 27న ఎన్నికల సంఘం ఓటర్ సవరణ షెడ్యూల్ ప్రకటించింది. అనంతరం నవంబర్ 4న SIR కసరత్తు ప్రారంభమైంది. ఇక తుది ఓటర్ల జాబితా ఫిబ్రవరి 14న విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యంతరాలు, విచారణల ప్రక్రియ మాత్రం ఫిబ్రవరి, 2026 కొనసాగుతుందని ఈసీ పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ