
హైదరాబాద్, 19 డిసెంబర్ (హి.స.)
హైదరాబాద్లో 2007, ఆగస్టు 25న
లుంబినీ పార్క, గోకుల్ చాట్లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ దాడుల్లో 42 మంది మరణించగా, 50కి పైగా గాయపడిన విషయం తెలిసందే. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఈ పేలుళ్లకు పాల్పడినట్లగా విచారణలో తేలింది. ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 2018లో ఇద్దరు నిందితులకు మరణశిక్ష విధించింది. అయితే, ఆ తీర్పును సవాలు చేస్తూ నిందితులు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు మరణ శిక్షను రద్దు చేయాలని లేని పక్షంలో జీవిత ఖైదుగా మార్చాలని వారు ఆ పిటిషన్లో పేర్కొన్నారు.
ఇవాళ జరిగిన విచారణలో భాగంగా హైకోర్టు డివిజన్ బెంచ్ నిందితుల మానసిక ప్రవర్తన, ఆరోగ్య పరిస్థితులు, పశ్చాత్తాప ధోరణిని పరిశీలించేందుకు ఇద్దరు మిటిగేషన్ ఇన్వెస్టిగేటర్లను నియమించింది. ఈ మిటిగేటర్లు జైలులో ఉన్న నిందితులతో మాట్లాడి వారి మనస్తత్వ పరిస్థితి, ఆరోగ్యం మరియు సంస్కరణ అవకాశాలపై నివేదిక సమర్పించనున్నారు. అదేవిధంగా, కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని నిందితులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణ ఇదే బెంచ్ లో కొనసాగుతుందని స్పష్టం చేసింది. కాగా కేసులో ప్రధాన నిందితులు రియాజ్ భట్కల్ వంటి వారు ఇంకా పరారీలో ఉన్న విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..