
అమరావతి, 25 డిసెంబర్ (హి.స.)
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్.జి.జయసూర్యపై ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. జయసూర్యను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. భీమవరం నూతన డీఎస్పీగా రఘువీర్‌విష్ణు నియమితులయ్యారు. భీమవరం సబ్ డివిజన్ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని పలువురు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు. కొందరి పట్ల పక్షపాతం చూపిస్తున్నారని, కూటమి నేతల పేర్లు వాడుతున్నారని వివరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన పవన్.. ఎస్పీ అద్నాన్ నయీం అస్మికి ఫోన్ చేసి మాట్లాడారు. డీఎస్పీపై వెంటనే తనకు నివేదిక పంపాలని కోరారు. ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించదనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు. భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రికి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ జయసూర్యను ప్రభుత్వం బదిలీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ