
తెలంగాణ, 25 డిసెంబర్ (హి.స.) ఫోన్ టాపింగ్ కేసు నేడు కీలక ఘట్టానికి చేరుకుంది.
హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) లోతుగా విచారిస్తోంది. అయితే, నేడు విచారణ చివరి రోజు కావడంతో కేసులో నిందితులైన ప్రణీత్ రావు, భుజంగ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలను సిట్ జూబ్లీహిల్స్ పీఎస్కు పిలిపించింది. దీంతో ఒకేసారి అందరికీ ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు మెజారిటీ ప్రశ్నలకు నో” అనే సమాధానం ఇచ్చారని సమాచారం.
ఇక ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును ఏ ప్రశ్న అడిగినా.. మాజీ డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లు నవీన్ చంద్, అనిల్ కుమార్ పేర్లను మాత్రమే ప్రస్తావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఫోన్ ట్యాపింగ్ చేసిన 6 వేల ఫోన్ నంబర్లు ఉన్న పెనైవ్పై ప్రభాకర్ రావు నోరు మెదపనట్లుగా తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు, రాజకీయ నేతల పాత్రపై ఆరా తీయగా ప్రభాకర్ రావు మాజీ మంత్రి హరీశ్ రావు పేరును ప్రస్తావించినట్లుగా సమాచారం. మావోయిస్టుల నుంచి ఆయనకు ప్రమాదం పొంచి ఉందని, ఆ విషయంపైనే ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీశ్ రావుతో చర్చించినట్లుగా విచారణలో ప్రభాకర్ రావు చెప్పారనే విషయం బయటకు పొక్కింది. కస్టోడియల్ విచారణ చివరి రోజు కావడంతో సిట్ అధికారులు డాక్యుమెంటేషన్ పనుల్లో నిమగ్నమయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు