
తిరుమల, 25 డిసెంబర్ (హి.స.)
: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు.
అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం (ఎస్‍ఎస్‍డీ) టోకెన్ల కోసం రద్దీ నెలకొంది. కోటా పూర్తికావడంతో అధిక సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం ఒక్కసారిగా ఎగబడటంతో విధుల్లో ఉన్న పోలీసు, తితిదే సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితి అదుపు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. టోకెన్ల కోటా పూర్తయిందని తితిదే సిబ్బంది ప్రకటించడంతో.. భక్తులు తిరుమలకు పయనమయ్యారు. మరో వైపు తిరుమలకు వెళ్లేందుకు భక్తులు సొంత వాహనాల్లో తరలి రావటంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల రద్దీ అమాంతం పెరిగిపోయింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలిస్తుండటంతో వాహనాల తనిఖీకి కొంత సమయం పడుతోంది. అలిపిరి ముఖద్వారం వరకు వాహనాలు బారులు తీరడంతో రద్దీని నియంత్రిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ