మావోయిస్ట్ పార్టీ నాయకత్వానికి.మరో. గట్టి దెబ్బ
నల్లగొండ 26 డిసెంబర్ (హి.స.) :మావోయిస్టు పార్టీ నాయకత్వానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్‌ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటరులో పార్టీ కేంద్ర కమిటీ సీనియర్‌ నేత, ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్‌ పాకా హనుమంతు అలియాస్
మావోయిస్ట్ పార్టీ నాయకత్వానికి.మరో. గట్టి దెబ్బ


నల్లగొండ 26 డిసెంబర్ (హి.స.)

:మావోయిస్టు పార్టీ నాయకత్వానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్‌ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటరులో పార్టీ కేంద్ర కమిటీ సీనియర్‌ నేత, ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్‌ పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే మరణించారు. ఆయనతోపాటు మరో ముగ్గురు మరణించారు. ఇదే రాష్ట్రంలోని గంజాం జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటరులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంగు గ్రామానికి చెందిన పాక హనుమంతు(67) తలపై రూ. 1.10 కోట్ల రివార్డు ఉంది. మరణించే సమయానికి దక్షిణ మధ్య బ్యూరో చీఫ్‌ హోదాలో సెంట్రల్‌ రీజియన్‌ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, కంధమాల్‌ జిల్లా రంభ రిజర్వు ఫారెస్టు అటవీప్రాంతంలో జవాన్లు రెండురోజులుగా కూంబింగ్‌ జరుపుతున్నారు. బుధవారం తెల్లవారుజామున వారికి పాక హనుమంతు బృందం తారసపడింది. ఆ వెంటనే ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో హనుమంతు, మరో ముగ్గురు చనిపోగా, మిగతావారు తప్పించుకున్నారు. ఘటనాస్థలంలో ఒక ఏకే 47, రెండు ఇన్సాస్‌ రైఫిళ్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశాల్లో చోటుచేసుకున్న పలు విధ్వంస ఘటనల్లో హనుమంతు నిందితుడిగా ఉన్నారు. కాగా, గంజాం జిల్లా తారాసింగి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని నారిగుచ్చా గ్రామ పరిసర ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు మావోయిస్టులకు జరిగిన మరో ఎన్‌కౌంటరులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వీరి నుంచి ఒక రివాల్వర్‌, ఒక 303 తుపాకీ, వాకీటాకీని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై రూ.24 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. సివిల్‌ డ్రెస్‌లో ఉంటూ మావోయిస్టు దళాలకు అవసరమైన వస్తువులను ఈ మహిళలు చేరవేస్తున్నట్టు భావిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande