
హైదరాబాద్, 26 డిసెంబర్ (హి.స.)
యూరియా కష్టాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనని విమర్శించారు. “అందరినీ తొక్కుకుంటూ వచ్చాను అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావని మండిపడ్డారు. నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతే అని అన్నారు.
రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు ముఖ్యమంత్రివా? అని హరీశ్రావు ప్రశ్నించారు. యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన నీ యూరియా యాప్ ఏమైందని నిలదీశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..