
కర్నూలు , 26 డిసెంబర్ (హి.స.)
కర్నూలు జిల్లాలో (Kurnool) న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. తోటి న్యాయవాదులను (Advocates) పోలీసులు అవమానించారంటూ నిరసనకు దిగారు. నేడు జిల్లాకు చెందిన న్యాయవాదులు విధులను బహిష్కరించి తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. పత్తికొండ, చిప్పగిరి ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వా్న్ని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో హాజరుపరచడానికి తీసుకొచ్చిన నిందితుడిని కోర్టు నుంచే బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే శివయ్య అనే వ్యక్తి చిప్పగిరి మండలంలో గంజాయి సాగు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో లొంగిపోయేందుకు బుధవారం పత్తికొండ కోర్టుకు వచ్చాడు. పత్తికొండకు చెందిన ఓ న్యాయవాది అతని తరపున కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో కోర్టుకు వచ్చిన నిందితుడిని మఫ్టీలో ఉన్న చిప్పగిరి ఎస్ఐ సతీశ్ కుమార్ సిబ్బంది కలిసి లాక్కెళ్లారు. ఆయనకు పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్ సహకారం అందించారు. ఈ క్రమంలో వారిని అక్కడే ఉన్న న్యాయవాదులు వారించారు. అయినప్పటికీ బలవంగా పోలీసు వాహనంతో ఎక్కించుకొని వెళ్లారని న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాకుండా అడ్డుకోబోయిన న్యాయవాదులను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
చట్ట విరుద్ధంగా వ్యవహరించిన ఎస్ఐలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV