
అమరావతి, 27 డిసెంబర్ (హి.స.)
అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాజధాని రైతుల సమస్యలపై సీఆర్డీఏ (CRDA) కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. దాదాపు 3 గంటలపాటు వివిధ అంశాలపై కమిటీ సభ్యులు చర్చించారు. రైతు సమస్యల పరిష్కారంపై కేంద్రమంత్రితో పాటు రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సమీక్షించారు. సమావేశం అనంతరం విలేకరులతో కేంద్రమంత్రి మాట్లాడారు. రైతులకు 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించారన్నారు. రిటర్నబుల్ ప్లాట్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఒప్పకున్నారని వెల్లడించారు.
రాజధాని పనుల్లో దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ సంస్థల ఒప్పందంతో 1600ల మందికి ఉపాధి కల్పించాలని తెలియజేశారు. యువత నైపుణ్య శిక్షణతో ఉపాధి పొందేలా కాంట్రాక్టర్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. జరీబ్ భూముల సమస్యలపై ఇప్పటికే సర్వే పూర్తి చేశామన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా జరీబ్ భూమి రైతులకు న్యాయం చేస్తామన్నారు. లంక భూముల రిజిస్ట్రేషన్ కు దరఖాస్తులు చేసుకోవాలని రైతులను కోరారు. అసైన్డ్ భూములకు సంబంధించిన న్యాయపరమైన ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV