
తిరుమల, 27 డిసెంబర్ (హి.స.)
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠద్వార దర్శనాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. శనివారం ఆయన తిరుమలలోని శిలాతోరణం వద్ద నుంచి దర్శన క్యూలైన్లను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లలో తాగునీరు, అన్న ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు.
వైకుంఠద్వార దర్శనాల నేపథ్యంలో భక్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని క్యూలైన్లలో పలు మార్పులు చేపట్టినట్లు చెప్పారు. క్యూలైన్లలో భక్తులు కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు తాగునీటి సౌకర్యం, క్యూలైన్లకు అనుసంధానంగా అదనపు శౌచాలయాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. చలికాలం కావడంతో క్యూలైన్లలోని పంపిణీ కేంద్రాల్లో అన్న ప్రసాదాలు వేడిగా ఉండే విధంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ