
విజయవాడ , 27 డిసెంబర్ (హి.స.)
విజయవాడ కనకదుర్గమ్మ గుడికి (Bejawada Kanaka Durga Temple) ఎక్కడాలేని కష్టమొచ్చింది. ఏ ఆధ్యాత్మిక కేంద్రంలో జరగని వింత ఘటన జరిగింది. దేవాదాయ శాఖ నిర్లక్ష్యమో.. విద్యుత్ శాఖ అత్యుత్సాహమో తెలియదు కానీ బెజవాడ కనకదుర్గమ్మ గుడికి విద్యుత్ సరఫరా (Electricity Supply) నిలిచిపోయింది. అధికారుల తీరుతో భక్త జనుల్లో ఆగ్రహం పెల్లుబిక్కుతోంది. పవిత్ర పుణ్యక్షేత్రం విషయంలో ఇలాంటి పాపపు రాజకీయాలేంటని భక్తులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానానికి భక్తుల నుంచి కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఇటువంటి పరిస్థితి రావడం పట్ల ఆవేదనను వెల్లిబుచ్చుతున్నారు. ఇందుకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే విద్యుత్ బిల్లు చెల్లించలేదన్న నెపంతో ఏపీసీపీడీసీఎల్ విజయవాడ కనకదుర్గమ్మ గుడికి శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. శుక్రవారం నాడు నోటీసులు ఇచ్చిన విద్యుత్ శాఖ శనివారం విద్యు్త్ సరఫరా నిలిపివేయడంతో ఆందోళన నెలకొంది. 2023 ఫిబ్రవరి నుంచి దేవస్థానం బిల్లు చెల్లించలేదని విద్యుత్ శాఖ పేర్కొంటోంది. సుమారు రూ.3.08 కోట్లు బకాయి పడినట్లు చెబుతోంది. పలుమార్లు దేవస్థానం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా స్పందన లభించలేదని విద్యుత్ శాఖ అంటోంది. ఈ నేపథ్యంలోనే హెచ్టీ లైన్ నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు ప్రకటించింది.
అయితే దేవస్థానం అధికారులు మాట్లాడుతూ.. తాము తమ సోలార్ ప్లాంట్ నుంచి దేవస్థానం అవసరాలకు విద్యుత్ ను వినియోగిస్తున్నట్లు పేర్కొంటున్నారు. నెట్ మీటరింగ్ కోసం పలుమార్లు విద్యుత్ అధికారులను కోరినట్లు కూడా చెబుతున్నారు. సాంకేతిక కారణాల సాకులను చెబుతూ విద్యుత్ శాఖ అధికారులు నెట్ మీటరింగ్ ఏర్పాటు చేయలేదంటున్నారు. దాని వల్ల సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ లెక్కలు తేలడం లేదంటున్నారు. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని విద్యుత్ పునరుద్ధరించాలని ఏపీసీపీడీసీఎల్ అధికారులను కోరారు. ప్రస్తుతం దేవస్థానానికి జనరేటర్ సాయంతో విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV