
ఢిల్లీ ,03, డిసెంబర్ (హి.స.) పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన న్యాయవాది రిజ్వాన్ అరెస్టయ్యాడు (Gurugram Lawyer). అతడు డబ్బులు తీసుకోవడానికి ఏడుసార్లు అమృత్‌సర్ వెళ్లాడని పోలీసుల అదుపులో ఉన్న అతడి స్నేహితుడు ముషారఫ్ అలియాస్ పర్వేజ్ వెల్లడించాడు. ఈ మేరకు దర్యాప్తు అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
2022లో సోహ్నా కోర్టులో ఇంటర్న్‌షిప్ చేస్తోన్న సమయంలో రిజ్వాన్, ముషారఫ్ స్నేహితులయ్యారు. తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయినా, వృత్తిపరంగా తరచూ కలిసేవాళ్లమని ముషారఫ్ వెల్లడించాడు. అతడు తరచూ అమృత్‌సర్ వెళ్లేవాడని, ఈ జులైలో అతడితో కలిసి తాను కూడా వెళ్లానని చెప్పాడు. అప్పుడు వాఘా సరిహద్దు వద్ద బైక్ మీద వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఒక బ్యాగ్‌లో రిజ్వాన్‌కు డబ్బు ఇచ్చారని తెలిపాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో తనకు తెలియదన్నాడు. రిజ్వాన్ ఏడుసార్లు అమృత్‌సర్ వెళ్లాడని, అతడు తీసుకున్న నగదులో రూ.41 లక్షలు అజయ్ అరోరా అనే వ్యక్తికి ఇచ్చినట్లు దర్యాప్తులో భాగంగా ముషారఫ్ వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ