
ఢిల్లీ ,03, డిసెంబర్ (హి.స.) : ఓటర్ల జాబితాల ‘ప్రత్యేక ముమ్మర సవరణ’ (సర్) అంశంపై విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయడంతో మంగళవారం పార్లమెంటు ఉభయసభలు స్తంభించిపోయాయి. వివిధ అంశాలను చర్చకు చేపట్టాలని ప్రభుత్వం తరఫున ప్రయత్నం జరిగినా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయి. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రతిపక్ష నేతల్ని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. అంశాన్ని చర్చించడానికి సిద్ధమేనని, నిర్దిష్ట సమయ పరిమితి మాత్రం విధించలేమని తెలిపింది. లోక్‌సభ ఉదయం సమావేశమయ్యాక రెండుసార్లు వాయిదాపడింది. భోజన విరామానంతరం మళ్లీ సమావేశమైనప్పుడు విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న సర్‌పై చర్చకు ప్రభుత్వం సుముఖంగా ఉందని, సభను కొనసాగనివ్వాలని సభాపతి స్థానంలో ఉన్న దిలీప్ సైకియా కోరారు. ఓటమి చెందిన ఆగ్రహాన్ని సభలో చూపించరాదని, మాజీ ప్రధాని వాజ్‌పేయీకీ ఓటమి తప్పలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ