రేపు దత్త జయంతి..
రేపు దత్తాత్రేయ పౌర్ణమి.
రేపు దత్త జయంతి.


అమరావతి, 3 డిసెంబర్ (హి.స.) :

మార్గశిర పౌర్ణమి రోజున శ్రీదత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపులు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది. త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము “సమర్పించుకున్నారు” కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు “ఆత్రేయ” అయింది.

త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు. దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు.

దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్తి. ఆయన బోధలు లోకకల్యాణ కారకాలు. భూమి నుంచి సహనశీలత, గాలినుంచి స్వేచ్ఛ, ఆకాశం నుంచి నిస్సంగత్వం నేర్చుకోవాలని ఉద్బోధించిన మార్గనిర్దేశకుడు. అగ్నినుంచి నిర్మలత్వాన్ని, సముద్రం నుంచి గాంభీర్యాన్ని, కపోతంనుంచి నిర్మోహత్వాన్ని గ్రహించాలన్నాడు. కొండచిలువలా భ్రాంతిలో పడకూడదన్నాడు. స్పర్శకు దూరంగా ఉండటం మిడత నుంచి, ఏనుగు నుంచి పట్టుదల, చేపనుంచి త్యాగచింతన నేర్చుకోవాలి. మానావమానాలకు సమస్పందన అలవరచుకోవాలి.

పౌర్ణమి తిథిరోజున కొన్ని పనులు చేస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్ముతుంటారు. అలాంటిది మార్గశిర పౌర్ణమి రోజున బ్రహ్మముహూర్తం చాలా దైవిక శక్తి కలదని పండితులు చెప్తున్నారు. మార్గశిరమాసం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే గీతలో అభివర్ణించాడని, అందుకే మార్గశిరంలో వచ్చే పూర్ణిమను మహా పూర్ణిమగా పిలుస్తారని చెప్తుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 4న.. అంటే రేపు మార్గశిర పూర్ణిమ.

గురువారం బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి, ధ్యానం చేయడం, దానం చేయడం వల్ల జీవితంలో శుభాలు జరుగుతాయని నమ్మకం. స్నానం చేసే నీటిలో తులసి ఆకులను వేసి, ఆ నీటిని తలపై చల్లుకుని నమస్కారం చేయాలి. ఆపై స్నానం ఆచరించి, సూర్యుడు ఉదయించే దిక్కులో నమస్కారం చేయాలి. తెల్లని లేదా పసుపురంగు దుస్తులు వేసుకోవడం శుభప్రదం.

ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను జపించడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఉదయం 4.19 గంటల నుంచి 4.58 మధ్య బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో 4 మంత్రాలను పఠిస్తే సిరిసంపదలు కలుగుతాయి.

1. ఓం శ్రీ హ్రీం శ్రీ కమలే కమలాలయే ప్రసిద్ధః

2. శ్రీ హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మమాయై నమః

3. ఓం శ్రీం శ్రీం శ్రీం శ్రీం సః చంద్రాంశే నమః

4. ఓం నమః నారాయణాయ్ నమో నమః

శివుడికి రుద్రాభిషేకం చేయడం వల్ల ఇంటిలో శాంతి, శ్రేయస్సు నెలకొంటాయి. సాయంత్రం శని ఆలయాన్ని సందర్శించి, శని దేవుడికి తెలుపు రంగులో ఉండే ఏదేని స్వీటును నైవేద్యంగా సమర్పించాలి. శివుడు, శనిదేవులను పూజించే సమయంలో ఓం నమఃశివాయ, ఓం శనేశ్చరాయ నమః మంత్రాలు జపించడం వల్ల, వృత్తి వ్యాపారాల్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande