
అమరావతి, 31 డిసెంబర్ (హి.స.):పంచారామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామలోని భీమేశ్వరస్వామి ఆలయం బయట స్వామివారి కొలను వద్దనున్న శివలింగాన్ని ఆగంతకులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. శివలింగాన్ని ధ్వంసం చేయడంపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై తాను జిల్లా ఎస్పీ, కలెక్టర్‌తో పాటు జిల్లా మంత్రితో మాట్లాడినట్లు సీఎంకు మంత్రి ఆనం వివరించారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు అంశాన్ని తనకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ