తెలంగాణ, జగిత్యాల. 20 జూన్ (హి.స.)
రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ దాచినా, నంబర్లు తొలగించినా కేసులు నమోదు చేస్తామని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ నంబర్ లేని, నంబర్ ప్లేట్ దాచి, కొన్ని నంబర్లు తొలగించిన వాహనాలను గుర్తించేందుకు పోలీస్ అధికారులు, సిబ్బంది వివిధ టీంలు గా ఏర్పడి ఏక కాలంలో తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీ చేయగా ఇందులో సరైన నెంబర్ ప్లేట్స్ లేని 306 వాహనాలను సీజ్ చేశారు. కాగా నంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి వాటికి సరైన నంబర్ ప్లేట్లను బిగించిన తర్వాత వాహనాలను విడిచి పెట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారీతిన వాహన నంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ-చలాన్ నుంచి తప్పించుకోవడం కోసం వాహనాలపై ఫ్యాన్సీ నంబర్ తో పాటు తప్పుడు నంబర్ లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయా నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలు గుర్తించలేనంతగా ఉంటున్నాయని, కొందరు కావాలనే వాటిని తొలగించడం, నంబర్ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ విరగ్గొట్టడం చేస్తున్నారు. ఇలాంటి వారు వాహన తనిఖీల్లో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు