పుట్టపర్తి, 10 జూలై (హి.స.)
శ్రీసత్యసాయి జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో మంత్రి లోకేష్‌తో కలిసి పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా కొంతమంది తల్లిదండ్రులు, టీచర్స్‌తో సమావేశమైన చంద్రబాబు.. పిల్లల చదువు కొనసాగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి వారి భవిష్యత్ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. చదువులో బాగా రాణించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని వారికి నిర్దేశించారు. తల్లిదండ్రులతో ముచ్చటించిన అనంతరం తరగతికి వెళ్లారు ముఖ్యమంత్రి. కాసేపు టీచర్‌గా మారి విద్యార్థులకు పాఠాలు చెప్పారు.
పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఇంతవరకూ కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ప్రక్రియ. దీన్ని ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్లలో కూడా అప్లై చేస్తోంది కూటమి ప్రభుత్వం. గత ఏడాది డిసెంబర్ ఏడున మెగా పీటీఎమ్ తొలి ప్రయత్నం విజయవంతమైంది. గురువారం సెకండ్ ఎపిసోడ్‌ను శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువులో నిర్వహించింది ప్రభుత్వం. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు..ఇలా ఒకే రోజున 2 కోట్ల 28 లక్షల మందితో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ప్లాన్ చేసింది ప్రభుత్వం.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజీల్లో మెగా పీటీఎం 2.0ను ఒక ఉత్సవంలా నిర్వహించింది ప్రభుత్వం. తమ పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారు..? వారి ప్రవర్తన ఎలా ఉంది? సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకుంటున్నారా లేదా?.. ఇలా అనేక అంశాలపై తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం కల్పించడమే మెగా పీటీఎం లక్ష్యం. తల్లిదండ్రులు కూడా వారి అభిప్రాయాలను, సూచనలను ఈ వేదిక ద్వారా ప్రభుత్వంతో పంచుకునే అవకాశం కల్పించింది. ప్రతీ ఏడాది ఇదే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ సమావేశం నిర్వహించాలనేది ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి