హైదరాబాద్, 10 జూలై (హి.స.) కల్తీ కల్లు ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఓ కల్లు కాంపౌండ్ లో కల్లులో సైకో ట్రోఫిక్ సబ్జెన్స్ కలపడం వల్ల 7గురు మృతి చెందారని, పలువురి ఆరోగ్యం విషమించిందని ఆయన తెలిపారు. రెండు సీసాల కల్లు తాగినవారిలో కిడ్నీలు దెబ్బతిన్నాయనడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఆసుపత్రిలో 31 మందికి చికిత్స జరుగుతోందని, బాధితుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రామచందర్ రావు తెలిపారు.
ఇది ఇప్పుడు కొత్తగా జరిగిన ఘటన కాదని.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎక్సైజ్ శాఖ కల్లు కాంపౌండ్ల యజమానులతో కుమ్మకై అయ్యిందని ఆరోపించారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, కళ్లు కాంపౌండ్లపై ప్రతిరోజు తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. ఏ రకంగా చూసినా ఈ విషప్రయోగ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన అన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి బాధితుడికి రూ. 1 లక్ష పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..