తెలంగాణ, సంగారెడ్డి. 10 జూలై (హి.స.)
నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో
శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డుకు శంకుస్థాపన, రూ.41 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.11 లక్షలతో పుట్టగూడ గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జిన్నారంలో నిర్మాణంలో ఉన్న శివాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. దేవాలయ నిర్మాణం జరుగుతున్న తీరును నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిగ్రామంతో పాటు కాలనీల్లో మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. సొంతింటి కలను సాకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని, త్వరితగతిన ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. జిన్నారంలో నిర్మాణంలో ఉన్న శివాలయంలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయించేలా నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదేవిధంగా జిన్నారంలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు