తెలంగాణ, వరంగల్. 10 జూలై (హి.స.) వరంగల్ నగరంలోని
భద్రకాళి దేవస్థానం లో గత పదిహేను
రోజులుగా జరుగుతున్న రాకాంత దీక్షపూర్వక శాకాంబరీ నవరాత్రులు నేటితో ముగిశాయి. గురువారం పదిహేనవ రోజు ఆషాడ శుక్ల పౌర్ణమి రోజున అమ్మవారిని శాకంబరిగా అలంకరించి పూజారాధనలు జరిపారు. ఉదయం 10 గంటలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలయానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం అమ్మవారి దర్శనానికి దేవస్థాన సిబ్బంది అనుమతించగానే భక్తులు కట్టలు తెంచుకున్న ఆనందంతో గుడి లోపలికి వచ్చి శాకంబరీ అలంకారం లో ఉన్న అమ్మవారిని దర్శించుకొని పులకించిపోయారు.
ఆలయానికి విచ్చేసిన మంత్రి కి ఆలయ చైర్మన్ డా బి.శివ సుబ్రహ్మణ్యం ధర్మకర్తలు, ఈఓ శేషు భారతి, ప్రధానార్చకులు భద్రకాళి శేషు లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేవస్థానం ప్రాంగణం అంతా భద్రకాళి శరణం మమ, శాకంబరీ శరణం మమ అనే నామ స్మరణతో మారుమ్రోగింది. వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సుమారు 10000 కిలోల కూరగాయలు, పండ్లు సేకరించి దండలుగా చేసి అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు