తెలంగాణ, మంచిర్యాల. 10 జూలై (హి.స.)
పాత నేరస్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గత అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలో 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో కార్డెన్ అండ్ సెర్చ్, వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్, పాత నేరస్థులకు కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు కేసుల్లో నేరస్థులు గా ఉన్న వారి వివరాలు సేకరించి వారి ఇంటికి వెళ్లి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ నేరస్థులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే పీడీయాక్ట్ నమోదు చేసి, నగర బహిష్కరణ లాంటి చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రౌడీ షీటర్లు, అనుమానితులు నిత్యం పోలీసులకు అందుబాటులో ఉండాలని, ఇతర గోడవల్లో తల దూర్చరాదని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు డీసీపీ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు