భీమవరం, 11 జూలై (హి.స.)
రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ముంబయి ముఠా చేతిలో జిల్లాకు చెందిన 8 మంది యువకులు మోసపోయారు. రూ.కోటికి పైగా సమర్పించి లబోదిబోమంటున్నారు. వీరికి మధ్యవర్తిగా వ్యవహరించిన మరో వ్యక్తిని కూడా ఇదే ముఠా బురిడీ కొట్టించింది. వీరంతా పలు పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. మధ్యవర్తి ఫిర్యాదు మేరకు ముఠాలోని ఏడుగురిపై మహారాష్ట్రలో కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. పోడూరు మండలానికి చెందిన మోహనరావు కొన్నేళ్ల కిందట వ్యాపారం నిమిత్తం ముంబయి వెళ్లి స్థిరపడ్డారు. ఇతని చిన్ననాటి స్నేహితుడైన తణుకు మండలానికి చెందిన రాఘవరాజు కొంతకాలం అక్కడే ఉన్నాడు. ఆ స్నేహంతో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా నీ కుమారుడికి రైల్వేలో ఉద్యోగం వేయిస్తానని చెప్పడంతో మోహనరావు సరేనన్నాడు. చింతలపూడి మండలానికి చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తి కూడా ముంబయిలో ఉంటున్నాడు. ఇతన్ని పరిచయం చేసి ఉద్యోగానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని చెప్పి పలు దఫాలుగా నగదు తీసుకున్నారు. మెయిల్ ద్వారా నకిలీ ఉద్యోగ నియామకపత్రం, గుర్తింపు కార్డు పంపించారు. అంతే కాకుండా విజయవాడలోని రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం వద్దకు తండ్రి, కుమారుడిని తీసుకెళ్లి అక్కడ ఒక వ్యక్తిని కార్యాలయ చీఫ్‌గా పరిచయం చేశారు. కార్యాలయం ఎదురుగా ఉన్న మరో భవనంలోకి తీసుకెళ్లి కుమారుడికి రక్త నమూనాలు, వేలిముద్రలు తీసుకుని పోలీస్ వెరిఫికేషన్ పూర్తి కాగానే ఉద్యోగంలో చేరాలని చెప్పి పంపించేశారు. కుమారుడికి రైల్వేలో ఉద్యోగం వచ్చిందన్న విషయం అప్పటికే జిల్లాలోని బంధువులకు తెలియడంతో పలువురు మోహనరావును సంప్రదించారు. ఈ విధంగా జిల్లా పరిధిలోని పాలకోడేరు, పోడూరు, పెనుగొండ, నరసాపురం మండలాలకు చెందిన 8 మందితో పాటు ముంబయికి చెందిన మరో నలుగురు మోహనరావు ద్వారా ముఠాకు పలు దఫాలుగా రూ.1,02,70,534 చెల్లించారు. ఉద్యోగాల ఊసు ఎత్తుతుంటే అదిగో ఇదిగో అంటూ ఏళ్ల తరబడి కాలయాపన చేయడంతో చివరికి మోసపోయామని గ్రహించిన మోహనరావు ముంబయిలోని ఎంబీవీవీ కమిషనరేట్ పరిధిలోని నవ్ఘర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ముంబయి, ఆంధ్రాకు చెందిన మొత్తం ఏడుగురుపై ఈ ఏడాది మే 10న కేసు నమోదు చేశారు. వీరిలో ప్రస్తుతం నలుగురు ఉమ్మడి పశ్చిమ గోదావరిలో నివసిస్తుండగా, మరో ముగ్గురు ముంబయిలో ఉంటున్నట్లు సమాచారం. ముఠా చేతిలో నయా మోసానికి గురైన యువకులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ