హైదరాబాద్, 11 జూలై (హి.స.)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఢిల్లీ లోని ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో సెంట్రల్ యూనివర్సిటీల స్థితిగతులపై సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి హాజరైన మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భారత రాజ్యంగా ఇచ్చిన హక్కులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పూర్తిగా హరిస్తోందని మండిపడ్డారు. యూనివర్శిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన జరిగినప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్గాంధీ విద్యార్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దుతును ప్రకటించారనే విషయాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో నేడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావు హెచ్సీయూకి వెళ్లి విద్యార్థుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఒత్తిడి తెచ్చారని ఫైర్ అయ్యారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీలో ప్రమోషన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఏది ఏమైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావు నియామకం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్క కామెంట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్