తెలంగాణ, నల్గొండ. 11 జూలై (హి.స.)
స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే రేషన్ కార్డుల పంపిణీ గొప్ప ఘట్టంగా నిలవబోతుందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండల కేంద్రంలో జూలై 14న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగనుందని తెలిపారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీ దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో జరుగుతుందని పేర్కొంటూ, ఏ ఎన్నికలతో సంబంధం లేకుండా రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.13 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 95 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందుతున్నట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు