హైదరాబాద్, 12 జూలై (హి.స.) విశ్వనగరం అంటే కేవలం హైటెక్ సిటీ కాదు.. శివారు ప్రాంతాల కాలనీల్లో కూడా మౌలిక వసతులు కల్పించడమే అభివృద్ధి సాధించడమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. శనివారం హయత్ నగర్ డివిజన్లో వారు పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ విశ్వనగరమని హైటెక్ సిటీని చూపుతూ అభివృద్ధి సాధించామని గొప్పలు చెబుతుందే తప్ప నగర శివారు ప్రాంతాల కాలనీల్లో కూడా మౌలిక వససతులైన రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలు కల్పించాలని సూచించారు. హైదరాబాద్ శివారులో కొత్తగా విస్తరించిన కాలనీల్లో గానీ, బస్తీల్లో గానీ సమస్యలు చూస్తే గుండె తరుక్కుపోతుందన్నారు.
రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థ లేకపోవడంతో కాలనీల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో వరదలకు ఇండ్లు మునిగిపోతున్నాయి తప్ప వరదలను తరలించేందుకు సరైన స్ట్రామ్ వాటర్ డ్రైన్లు ఏర్పాటు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్ నగర్, మన్సూరాబాద్, నాగోల్ డివిజన్లల్లో సరైన డ్రైనేజీ, రోడ్లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ లేకపోవడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. నగర శివారు కాలనీలు, బస్తీల్లో కూడా మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.
లక్షలాది మంది నివాసముంటున్న దాదాపు 30 కాలనీల ప్రజలు రాకపోకలు సాగిస్తున్న ప్రధాన మార్గంలో కూడా కనీసం రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్