తెలంగాణ, నల్గొండ. 12 జూలై (హి.స.) ప్రమాదాలు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్
రద్దు చేసేలా భవిష్యత్లో చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే వాహనాల వెనుక వైపు రిఫ్లెక్టర్ రేడియం స్టిక్కర్లను తప్పనిసరిగా వేసుకునే విధంగా జీఓ తీసుకురానున్నట్లు, డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో కలిసి నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని దండంపల్లి వద్ద రూ.8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు తిప్పర్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాడ్గులపల్లిలో నూతన భవనాల నిర్మాణం, నల్లగొండ బస్టాండ్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనం నడపడం, వాహనం ఫిట్నెస్ లేకపోవడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వీటిని తగ్గించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. మనిషికి జబ్బు చేసినప్పుడు సీటీ స్కాన్ తీసిన విధంగానే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లో సాంకేతిక పరికరాల సహాయంతో సుమారు 15 అంశాల్లో వాహనం రోడ్డుపై తిరిగేందుకు పనికి వస్తుందా లేదా అన్నది నిర్ధారిస్తుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు