హైదరాబాద్, 12 జూలై (హి.స.)
కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాడానికి కార్యకర్తలు, నాయకులు, పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడ్డారని, నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదని ఎంపీ (రాజ్యసభ) రేణుకా చౌదరి మండిపడ్డారు. పార్టీలో అడ్రస్ లేని వారికి పదవులు ఇచ్చారన్నారు. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుని స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్లు చెప్పారు. పదవుల విషయంలో పార్టీలో చాలా అసంతృప్తి ఉందన్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడిన కార్యకర్తలెవరికీ గుర్తింపు లభించడం లేదని ఆరోపించారు. చుట్టపుచూపుగా వచ్చిన వారికి.. అడ్రస్ లేని వాళ్లకు పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు.నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరిగే సహించనుఅసలుసిసలైన కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం తాను ఊరకునేది లేదని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం లేదని విమర్శించారు. తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డనని, తనను ఆపేది ఎవరని మండిపడ్డారు. పార్టీ పదవుల విషయంలో తనకే అసంతృప్తిగా ఉందని.. ఇక సాధారణ కార్యకర్తలకు ఉండదా అని కామెంట్ చేశారు. స్థానిక ఎన్నికల్లోపు పార్టీలో అసంతృప్తి అన్న మాట వినపడకుండా చేయాలని ఆమె రాష్ట్ర అధినాయకత్వంతో పాటు పార్టీ హైకమాండ్‌కు రేణుక చౌదరి విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్