అమరావతి, 13 జూలై (హి.స.)
మంత్రాలయం: మరికొన్ని గంటల్లో సొంతూరికి బయలుదేరనున్న ఆ స్నేహితుల ఆశలు తుంగభద్ర నదిలో కలిసిపోయాయి. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చిన ఏడుగురు స్నేహితుల్లో ముగ్గురు యువకులు నదిలో గల్లంతు కాగా మృతదేహాలు ఇవాళ లభ్యమయ్యాయి. కర్ణాటక రాష్ట్రం హసన జిల్లా జావగల్లుకు చెందిన డిగ్రీ చదువుతున్న సచిన్(20), ప్రమోద్(20), సంగరాయపురానికి చెందిన అజిత్(19) అనే యువకులు స్నేహితులతో కలసి శుక్రవారం తెల్లవారుజామున రైల్లో మంత్రాలయం చేరుకున్నారు. ఉదయం తుంగభద్ర నదిలో స్నానం చేసి గ్రామ దేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు.
మఠం ముందు స్నేహితులంతా కలసి సరదాగా సెల్ఫీ చిత్రాలు కూడా తీసుకున్నారు. శనివారం రాత్రి 11 గంటలకు రైలు ఉండగా, సాయంత్రం నాలుగు గంటలకు గది ఖాళీ చేసి తుంగభద్ర నదీ తీరానికి చేరుకున్నారు. నదిలో సరదాగా చిత్రాలు తీసుకొని స్నానాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు సచిన్ కాలు జారీ నదిలో పడిపోయాడు. స్నేహితుడిని రక్షించడానికి ప్రమోద్, అజిత్‌లు చేయి అందించడానికి ప్రయత్నించగా నీటి ఉద్ధృతికి ముగ్గురు కొట్టుకుపోయారు. వారిని రక్షించడానికి రఘునాథ్ అనే యువకుడు ప్రయత్నించగా.. అతడు కూడా నదిలో కొట్టుకు పోతుండగా స్థానికులు రక్షించారు. కానీ సచిన్, ప్రమోద్, అజిత్‌లు కళ్లముందే కొట్టుకుపోవడంతో స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. గాలింపు చేపట్టిన పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ