హైదరాబాద్, 13 జూలై (హి.స.)
ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి నిర్వహించే లష్కర్ బోనాల జాతర ఈ ఉదయం ప్రారంభమైంది. ఉదయం 4 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన సతీమణితో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తూ పూజలు నిర్వహించారు. పవిత్ర ఘట్టానికి హాజరై భక్తిశ్రద్ధలతో మొదటి బోనాన్ని సమర్పించారు.
బోనం సమర్పించేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ నేతలు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పిఎల్ శ్రీనివాస్ అమ్మవారి దర్శనానికి వచ్చారు.
ఇప్పటికే దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, కమిషనర్ ఐ. వెంకటరావు, నార్త్ జోన్ డీసీపీ రష్మిక పెర్మల్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని భద్రతా ఏర్పాట్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..