హైదరాబాద్, 15 జూలై (హి.స.)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటికే పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తమ నుండి ఎటువంటి అనుమతి లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా బనకచర్లపై ఏపీకి తెలంగాణ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలు, తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుకు సిద్ధం అయింది.
ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి ఆర్ ఇరు రాష్ట్రాలకు లేఖ రాశారు. ఈ సమావేశానికి రావడానికి వీలవుతుందో లేదో చెప్పాలని లేఖలో పేర్కొంది. కేంద్ర మంత్రి లేఖపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రానికి ప్రతి లేఖను అందించింది. అందులో ఇప్పటికే బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని.. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై.. చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్