అమరావతి, 15 జూలై (హి.స.)
శ్రీశైలం ఆలయం, : శ్రీశైల మహాక్షేత్రంలో భక్తులకు అభిషేకం చేయిస్తానని డబ్బులు వసూలు చేసి మోసగించిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన దీపక్, ముఖేష్ అనే భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం దర్శనానికి వచ్చారు. స్థానిక కొత్తపేట కాలనీకి చెందిన యువకుడు పవన్ వారిని కలిసి గర్భాలయ అభిషేకం చేయిస్తానని చెప్పి రూ.15 వేలు వసూలు చేశాడు. వారికి రూ.150 దర్శనం టిక్కెట్లు ఇప్పించి ఆలయంలోకి పంపాడు. చివరికి తాము మోసపోయినట్లు భక్తులు గుర్తించారు. అక్కడే ఉన్న ఏఈవో హరిదాస్ వారిని విచారించారు. గర్భాలయ అభిషేకం చేయిస్తానని చెప్పి మోసం చేసినట్లు ఏఈవోకు వివరించారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకున్న దేవస్థానం అధికారులు మోసం చేసిన యువకుడిని గుర్తించి రూ.15 వేలను తిరిగి ఇప్పించారు. దేవస్థానం ముఖ్య భద్రతాధికారి మల్లికార్జున ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ