తెలంగాణ, కామారెడ్డి. 15 జూలై (హి.స.)
హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక అభివృద్ధి కుంటు పడుతుందని చెప్పారు.గ్రామాల అభివృద్ధి పంచాయతీ కార్యదర్శుల పై పడడంతో వారు సరైన అభివృద్ధి చేయలేకపోతున్నారని తెలిపారు. కేంద్రం నుండి సరైన నిధులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్ల కు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం తమపై భారం పడుతుందని చెప్పారు. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులైనా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు