తెలంగాణ, మెదక్. 15 జూలై (హి.స.)
వ్యవసాయ పొలం వద్ద బోరు మోటారు నడవకపోవడంతో మరమ్మత్తు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి రికార్డు అసిస్టెంట్ మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని చేగుంట మండల పరిధి ఇబ్రహీంపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన మరిపల్లి శ్రీనివాస్ (35) తూప్రాన్ ఆర్డీఓ ఆఫీస్ లో రికార్డు అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద వరి నాట్లు వేసే సందర్భంగా బోరు మోటర్ నడవకపోవడంతో మరమ్మత్తు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే విద్యుత్ షాక్ తగిలి శ్రీనివాస్ మృతి చెందాడు. మృతుడికి భార్య రమ్య, కుమారులు దీక్షిత్, భరత్ ఉన్నారు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు స్థానిక పోలీసులు గ్రామానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు