తెలంగాణ, పెద్దపల్లి. 17 జూలై (హి.స.)
పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత కల్పించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. అంతర్గాం మండలం మద్దిరాల గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు, అంగన్వాడీ కేంద్రం, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, పోట్యాల గ్రామంలోని ఎంపిపిఎస్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బ్రాహ్మణపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, గోలివాడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడా గడ్డి, పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్త వహించాలని, పాఠశాలల్లోని పిల్లలకు విష జ్వరాలు రాకుండా చూసుకోవాలన్నారు. పాఠశాలలకు ఎటువంటి సమస్యలు వచ్చిన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని, రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఎటువంటి అవసరాలు లేకుండా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని, వాటిని వెను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు