అమరావతి, 2 జూలై (హి.స.) ముఖ్యమంత్రి హోదాలో నిత్యం రాజకీయ, అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు ప్రజలతో మమేకం అయ్యేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటనే చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చోటుచేసుకుంది. తన పర్యటన మార్గంలో ఎదురుచూస్తున్న ఓ కుటుంబం అభ్యర్థన మేరకు, వారి పసిపాపకు ఆయన నామకరణం చేసి ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తారు.
వివరాల్లోకి వెళితే... సీఎం చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో, ఓ కుటుంబం తమ పసిపాపతో నిరీక్షిస్తూ కనిపించింది. వారిని గమనించిన చంద్రబాబు తన వాహనాన్ని ఆపి, వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా, ఆ చిన్నారి తల్లిదండ్రులు తమ బిడ్డకు ముఖ్యమంత్రే పేరు పెట్టాలని కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన చంద్రబాబు, పాపను ప్రేమగా చేతుల్లోకి తీసుకున్నారు. ఏ అక్షరంతో పేరు మొదలవ్వాలని వారిని అడగ్గా, 'ఎస్' (S) అక్షరంతో వచ్చేలా పెట్టమని వారు సూచించారు. అక్కడున్న వారితో కాసేపు ముచ్చటించిన అనంతరం, చిన్నారిని ముద్దాడి 'షర్లిన్ ప్రశస్థ' అని పేరు పెడుతున్నట్లు ప్రకటించారు.
తమ బిడ్డకు స్వయంగా ముఖ్యమంత్రే పేరు పెట్టడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. పాప తల్లి అశ్విని, మేనమామ సునీల్ మాట్లాడుతూ, తమ చిన్నారికి ముఖ్యమంత్రి నామకరణం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది తమ జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి