పెద్దారెడ్డికి ఇదే నా ఫైనల్ వార్నింగ్: జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి, 2 జూలై (హి.స.) వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దారెడ్డి అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని, చట్టాలను పక్కనపెట్టి
పెద్దారెడ్డికి ఇదే నా ఫైనల్ వార్నింగ్: జేసీ ప్రభాకర్ రెడ్డి


తాడిపత్రి, 2 జూలై (హి.స.) వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దారెడ్డి అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని, చట్టాలను పక్కనపెట్టి తనపై, తన కుమారుడిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని ఆయన మండిపడ్డారు. పెద్దారెడ్డికి ఇదే తన చివరి హెచ్చరిక అని, ఆయన అక్రమాల చిట్టా తన వద్ద ఉందని, వాటిని బయటపెడతానని స్పష్టం చేశారు. అనంతపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ఐదేళ్లలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిని సర్వనాశనం చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. నన్ను 130 రోజులు, నా కుమారుడు అశ్మిత్ రెడ్డిని 75 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు. అధికారం ఉందని విర్రవీగి మాపై కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికారం పోగానే కాళ్లు పట్టుకునే రకంగా వ్యవహరిస్తున్నారు. తాడిపత్రి ప్రజలే పెద్దారెడ్డిని ఊళ్లోకి రానివ్వడం లేదు అని ఆయన అన్నారు. పెద్దారెడ్డి పెద్ద కుమారుడు ఒక రోగ్ అని, నియోజకవర్గాన్ని దోచుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పెద్దారెడ్డి భూ అక్రమాలపై జేసీ పలు ఆరోపణలు చేశారు. తాను నివసిస్తున్న 6 సెంట్ల ఇంటిని కూడా ఫ్రాడ్ చేసి రిజిస్టర్ చేయించారని, కోటమికుంట్లలో వందల ఎకరాల భూములను కబ్జా చేశారని దుయ్యబట్టారు. రైతులు సోలార్ ప్రాజెక్టుల కోసం ఇచ్చిన భూములను కూడా కన్వర్షన్ చేసి, అక్రమంగా పాసు పుస్తకాలు సృష్టించారని ఆరోపించారు. ఈ అక్రమాలన్నింటికీ సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, వాటిని త్వరలోనే పంపిస్తానని జేసీ స్పష్టం చేశారు. తనకు కనీసం గన్‌మెన్ కూడా లేరని, కానీ పెద్దారెడ్డి మాత్రం ప్రైవేటు గన్‌మెన్‌లను పెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న పెద్దారెడ్డి తనపై దాడికి ప్రయత్నించే అవకాశం ఉందని, అయితే తననెవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

వ్యక్తిగత విమర్శలకు దిగుతూ, పెద్దారెడ్డి తనను 'ముండమోపి' అని దూషిస్తున్నారని, అసలు ఆయన ఏ జెండరో కూడా తెలియడం లేదని జేసీ ఎద్దేవా చేశారు. పెద్దారెడ్డిని 'డాంకీ', 'క్రాస్ బ్రీడ్' అంటూ తీవ్రమైన పదజాలంతో విమర్శించారు. గతంలో ఆయన సారా కాచారని, ఇసుక అక్రమ రవాణా చేశారని, అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తనకు అలాంటి అవసరం లేదని, మీసం మెలేసి బతుకుతున్నానంటూ జేసీ మీసం తిప్పి తన నిరసనను వ్యక్తం చేశారు. తాను వైసీపీ నేతలందరికీ వ్యతిరేకం కాదని, ఒకప్పుడు తన అన్న దివాకర్ రెడ్డి శిష్యులుగా ఉన్నవారే ఇప్పుడు వైసీపీలో ఉన్నారని గుర్తుచేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande