హైదరాబాద్, 20 జూలై (హి.స.)గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి తాను అస్సలు వెళ్లను తెలపారు. తాను ఏ పార్టీలో చేరను అని స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాను అని, ఎమ్మెల్యే పదవికీ బీజేపీ రాజీనామా చేయ్యమంటే చేస్తాను అని చెప్పారు. గోషామహల్లో ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈరోజు ఉదయం లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారిని ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో
మాట్లాడుతూ... 'అమ్మవారి దర్శనం అనంతరం ఓ మంత్రితో మాట్లాడా. మోడల్ గోశాల కట్టడానికి నా సహకారం కావాలని కోరారు. ఏ పార్టీలో ఉన్నా అందరి లక్ష్యం ఒకటే, ప్రజలకు మంచి చేయడం. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని వైభవంగా కడతామని గత ప్రభుత్వాలు రాజకీయం చేశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మవారి గుడిని వైభవంగా కట్టాలని కోరుతున్నా. తాగి ఆడే బోనాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బోనాల సంస్కృతి నాశనం చేయడానికి చాలా కాలంగా కుట్ర జరుగుతోంది' అని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..