తెలంగాణ, నిర్మల్ 20 జూలై (హి.స.)
అమ్మ చల్లంగా దీవించు అంటూ..!
ఆదివారం బైంసా పట్టణంలోని ప్రజలు గట్టు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించే బోనాల పండుగ ఈ సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరిగింది. పట్టణంలోని పలు కాలనీల వాసులు హాజరై బోనాలను ఊరేగింపుగా తీసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే పేరున్న గట్టు మైసమ్మను భక్తులు దర్శనం చేసుకుని కానుకలు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై బోనమెత్తి అమ్మవారికి హారతి అందించారు. పాడిపంటలతో రైతులు, తాలూకా, పట్టణ ప్రజలందరూ సుఖ శాంతులతో ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరారు. బోనాల పండుగలో పట్టణ నాయకులు, ప్రజలు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు