విశాఖపట్నం, 21 జూలై (హి.స.)
: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో.. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సోమవారం విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఆదివారం శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, పల్నాడు, శ్రీసత్యసాయి, బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. రాత్రి ఏడు గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం.. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా మందసలో 81 మిల్లీమీటర్లు, పైడిభీమవరంలో 79 మి.మి., ప్రకాశం జిల్లా టంగుటూరు, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 77 మి.మీ. వర్షపాతం నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ