తెలంగాణ, మెదక్. 21 జూలై (హి.స.)
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. సోమవారం హవేలీ ఘన్పూర్ మండలం సర్దన గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందుతున్న తీరుపై కలెక్టర్ ఆరా తీశారు. ముందుగా సిబ్బంది హాజరు పట్టిక, ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు తదితర విషయాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
రోగులతో మాట్లాడి వైద్య సేవలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని అడిడి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో సహజ ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మందులు అన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు