మంత్రాలయం, 22 జూలై (హి.స.)
: మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుబుదేంద్ర తీర్థులు మంగళవారం తెల్లవారుజామున చాతుర్మాస్య దీక్ష స్వీకరించారు. శూన్య మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా శ్రీమఠంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మంగళవారం తెల్లవారుజామున పీఠాధిపతి దీక్షను స్వీకరించారు. ముందుగా రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించి పట్టుబట్టలు అలంకరించారు. అనంతరం పూజా మందిరంలో విశేష పూజలు నిర్వహించి 13వ చాతుర్మాస దీక్షను స్వీకరించారు. 48 రోజులపాటు ఈ దీక్షలో పీఠాధిపతి కొనసాగుతారు. దీక్షలో ఉన్నంతకాలం పీఠాధిపతి గ్రామ పొలిమేరలు దాటకుండా శ్రీమఠంలోనే ఉంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు వేద పండితులు శ్రీమఠం తరలివచ్చి వేదాధ్యయనంలో పాల్గొంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ