హైదరాబాద్, 21 జూలై (హి.స.) సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ వాహనంపై సుమారు 12 మంది దుండగులు అటాక్ చేసేందుకు యత్నించిన విషయం విదితమే. ఆదివారం సాయంత్రం బోనాల పండుగ సందర్భంగా మాణిక్యేశ్వర్ నగర్ లో తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కారుపై దాడికి ప్రయత్నిస్తున్న సందర్భంలో అడ్డుకోబోయిన గన్మెన్ల చేతుల్లో ఆయుధాల లాక్కునేందుకు దుండగులు ప్రయత్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్యే శ్రీగణేష్ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే జరిగిన ఘటనపై తాజాగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పందించారు. తన రూట్లో తాను వెళ్తుండగా.. తన వాహనానికి సైడ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని తెలిపారు. అనంతరం తనతో పాటు గన్మెన్లతోనూ దుండగులు వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. అందుకే తాను స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. అయితే, తనపై అటాక్ చేసేందుకు ప్రయత్నించిన వారిలో ముగ్గురిని గుర్తుపడతానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్